నౌకాదళంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ బాధ్యతలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురుష ఆఫీసర్ల తరహాలోనే మహిళా ఆఫీసర్లు కూడా నేవీ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు కోర్టు చెప్పింది. దీంట్లో ఎటువంటి వివక్ష ఉండకూడదని పేర్కొన్నది. భారతీయ నేవీలో మహిళలు, పురుషులకు ఒకే తరహా పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ తన తీర్పులో పేర్కొన్నది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. మూడు నెలల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశాలు జారీ చేసింది. పర్మెంట్ కమిషన్ ద్వారా నేవీలో ఇక మహిళా ఆఫీసర్లు రిటైర్ అయ్యేంత వరకు పనిచేయవచ్చు. ఎస్ఎస్‌సీ ప్రకారం ప్రస్తుతం సర్వీసు పదేళ్లు మాత్రమే ఉన్నది. ఇప్పుడు మరో నాలుగేళ్లు పొడిగిస్తారు. ఆర్మీలోనూ మహిళలకు పర్మినెంట్ కమిషన్ హోదా ఇస్తూ ఇటీవల సుప్రీం తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. నేవీలో మహిళలకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వడం శుభ పరిణామం అని ఎంపీ హేమామాలిని అన్నారు. మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని ఆమె అన్నారు.
నేవీలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్